Tuesday, September 19, 2017


బతుకమ్మ పండుగ విశిష్టత

నీలాకాశాన్ని సిబ్బిగా మలచి సింగిడిని పూల వరుసలుగా పేర్చి ప్రకృతినే దేవతగా పూజించే పండుగ “బతుకమ్మ పండుగ”. ప్రపంచంలో మరెక్కడాలేని రీతిలో తెలంగాణకే ప్రత్యేకమైన రంగురంగుల పూల పండుగ ఇది
‘భట్టునరసింహ’  అనే రాజు కవిచోళ దేశం పరిపాలించేవాడు.  ఆయన చాలా ధర్మాత్ముడు. అతని భార్య సత్యవతి. ఒక యుధ్ధంలో ఆ రాజు తన బంధుమిత్రులను కోల్పోయి రాజు తన భార్య సత్యవతితో అడవులకు వెళ్లిపోయాడు. ఆ తరువాత ఆయన శ్రీమహాలక్ష్మీదేవిని మనసున తలచి గొప్ప తపస్సు చేశాడు. కొంత కాలానికి శ్రీమహాలక్ష్మీదేవి సాక్షాత్కరించి ఏమి వరం కావాలని అడిగింది. మాకు సంతానం లేక బాధపడుతున్నాము తల్లీ! మమ్ములను కరుణించి నీవే మా కుమార్తె గా జన్మించాలని వేడుకున్నారు. అందుకు ఆమహా లక్ష్మీదేవి సంతోషించి తథాస్తు అన్నది. కొంత కాలానికి సత్యవతి గర్భాన శ్రీమహాలక్ష్మీదేవి జన్మించింది. ఆ బాలికను చూచి మునులు, ఋషులు ఎంతో సంతోషించి అనారోగ్యాలు లేకుండా బాగా బతుకమ్మ అని దీవించారు. ఆనాటి నుండి ఆమెను “బతుకమ్మ” అని పిలవసాగారు. బతుకమ్మ జన్మించిన కొంత కాలానికే రాజు తిరిగి తన రాజ్యాన్ని సంపాదించి రాజ్యమేలాడు. ఆ రాజ్య ప్రజలు సుఖశాంతులతో ఎంతో ఆనందంగా జీవించారు. బతుకమ్మ పెరిగి పెద్దదై యుక్త వయస్సు వచ్చింది. శ్రీమహావిష్ణువు చక్రాంకుడు అనే రాజుగా వచ్చి బతుకమ్మను వివాహమాడాడు. ఆ దంపతులు ఎంతో కాలం సిరి సంపదలతో రాజ్య పరిపాలన చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు దసరా సమయంలో బతుకమ్మ ఉత్సవాలు చేస్తారు.
బతుకమ్మను కొంతమంది గౌరమ్మగా భావిస్తారు. కొంతమంది బొడ్డమ్మగా పిలుస్తారు. బతుకమ్మను పేర్చి స్త్రీలు, పిల్లలు లయ బద్దంగా పాడుతూ బతుకమ్మను ఆడతారు.
శ్రీ చక్రానికి ప్రతిరూపంగా తలచి బతుకమ్మను ఒక పళ్ళెంలో రంగు రంగు పూలతో గుండ్రంగా ఎత్తుగా పేర్చుతారు. పసుపు ముద్ద చేసి ఆ ముద్దను గౌరమ్మగా భావించి బతుకమ్మ పైన పెడతారు. బతుకమ్మను దేవుని ముందు ఉంచి, పూజలు చేసి ఇంటి ముందర పెట్టి ఇరుగు పొరుగు స్త్రీలు కూడా తాము చేసిన బతుకమ్మలను తీసుకొని వచ్చి ఇంటి ముందు పెట్టి అందరూ కలిసి లయబధ్ధమైన అడుగులు వేస్తూ, చప్పట్లు కొడుతూ బతుకమ్మల చుట్టూ “బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో! బంగారు బతుకమ్మ ఉయ్యాలో!” అని ఒకరు పాడగా మిగతా వారు అందరూ ఆమె పాడిన విధంగా పాడతారు. ఈ బతుకమ్మ పాటలలో ఎన్నో నీతులు, ఎన్నో సంప్రదాయ విలువలు నిండి ఉంటాయి.
బతుకమ్మ అంటే బతుకుదెరువును మెరుగు పరిచే అమ్మ అని అర్థం. ప్రకృతి నుంచి సేకరించిన పూలను తిరిగి ప్రకృతికే సమర్పించడం బతుకమ్మ పండుగ విశిష్టత. విభిన్నమైన పూలతో బతుకమ్మను చేసి, పూజించి తెలంగాణ ఆడపడుచులు ఆనందోత్సాహాలతో, సంప్రదాయంగా, వేడుకగా జరుపుకునే పూలపండుగ ఇది.
తొమ్మిది రోజుల పాటు తెలంగాణ అంతటా ఒక జాతరలా సాగే ఈ పండుగ మన వాకిట్లో బతుకు తెరువును ఆవిష్కరిస్తుంది. ఆట పాటలతో మనల్ని సేద తీరుస్తుంది. జీవన సంబురాన్ని ఆవిష్కరిస్తుంది.
తెలంగాణ సాంస్కృతిక జీవనా వైవిధ్యం ఇతర ప్రాంతాలకు భిన్నం. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా కేవలం తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే పరిమితమైన పండుగ ఇది. వర్షా కాలం ముగిసి జల వనరులు సమృధ్ధిగా నిండి, పూలు బాగా వికసించే కాలంలోబతుకమ్మ పండుగ వస్తుంది.
తంగేడు, గునుగు, కట్ల, గుమ్మడి, గన్నేరు, రుద్రాక్ష, బంతి, చేమంతి, బీర, కాకర వంటి పూలతో బతుకమ్మను అందంగా పేర్చుతారు. పేర్చిన పూల మధ్య, గుమ్మడిపూల మధ్యలో ఉండే పుప్పొడి లేదా పసుపు ముద్దను ఉంచి, పక్కన మట్టి ప్రమిదలో దీపాన్ని, అగర్వత్తులను వెలిగించి పూజిస్తారు. బతుకమ్మ పండుగ అన్ని రోజులు పల్లెలు, పట్నాలు పూలవనాలౌతాయి.
ఎంగిలి పూల బతుకమ్మతో తెలంగాణ అంతటా బతుకమ్మ పండుగ మొదలవుతుంది. ప్రకృతితో మమేకమై ఆట పాటలతో, ఆనదోత్సాహాలతో ఈ పండుగను జరుపుకుంటారు. పండుగ నాటికే ప్రకృతి అంతా పూలవనంగా మారుతుంది. ప్రకృతిలో సేకరించిన మాలను ప్రకృతికే సమర్పించడం అనే ఉద్దేశ్యంతో బతుకమ్మలను నీటిలో విడిచి పెడతారు.

No comments:

Post a Comment