Friday, February 26, 2016

నమో శ్రీ వెంకటేశ



అల్లనల్లన అమృతంపు జల్లు చల్లు
చల్ల చల్లని దివ్య హస్తములు నీవి
ఆ కరమ్ములు శుభముల కాకరములు
స్నిగ్ధ దరహాస! జయ జయ శ్రీనివాస !
శ్రీ వేంకటేశ్వరా! మెల్ల మెల్ల గా అమృతంపు జల్లు ను చిలకరించెడి దివ్య హస్తములు నీవి. ఆ నీ దివ్య హస్తములు సర్వ శుభములకు నిలయములు కదా ప్రభూ !. సర్వ శుభములకు నీ దివ్య ఆశీస్సులే కారణములు.
మంద మారుత సంస్పర్శలందు కరగి
కమ్మతేనెలు చిందు నెత్తమ్మి లీల
తన్మయంబగు నీ స్మృతిన్ మన్మనంబు
స్నిగ్ధ దరహాస! జయ జయ శ్రీనివాస !
శ్రీనివాసా ! హే జగన్నివాసా! మలయ మారుతములతో పులకించి, కమ్మని తేనెలను చిందించు తామరపువ్వు వలె నా మనస్సు నీ స్మరణ తోనే పులకించి పోతోంది ప్రభూ !
( Ravi Prasad Muttevi గారు వ్రాసిన గీతాలు )

1 comment: